న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. బీహార్లోని 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాలలో రూ. 10,000 చొప్పున నగదు బదిలీ చేశారు. మహిళా లబ్ధిదారులకు ఏకమొత్తంగా రూ. 7,500 కోట్ల నగదు బదిలీ జరిగింది. ఎన్నికల్లో గెలుపుపై అపనమ్మకంతోనే ప్రధాని మోదీ ఎన్నికల ముంగిట మహిళలకు తాయిలాలు ప్రకటించారని విపక్షాలు ధ్వజమెత్తాయి. కాగా, వ్యాపారం చేసుకునేందుకు ఈ డబ్బును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ సూచించారు.
స్వయం ఉపాధి కల్పన కోసం మరో రూ. 2 లక్షలు కూడా పొందవచ్చని ప్రధాని వారికి చెప్పారు. గతంలో ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలో మహిళలు దీనస్థితిలో ఉండేవారని, రోడ్లు, శాంతి భద్రతలు ఉండేవి కావని ఆయన చెప్పారు. ఇప్పుడు నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని, మంచి రోడ్లు కూడా వచ్చాయని మోదీ తెలిపారు. ఆర్జేడీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వవద్దని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు.
బీహార్లో మహిళల కోసం ప్రధాని మోదీ ప్రారంభించిన నగదు బదిలీ పథకంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం పాట్నాలో మహిళా సంఘాలతో సమావేశమైన ప్రియాంక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. మహిళా ఓట్లను రాబట్టుకునేందుకు చేసిన యత్నమని ఆమె చెప్పారు. గడచిన 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడే ఎందుకు రూ. 10,000 చొప్పున మహిళలకు నగదు బదిలీ జరిగిందని ఆమె ప్రశ్నించారు. నెలకు రూ. 10,000 చొప్పున ఇస్తామని ఎందుకు చెప్పడం లేదని ఆమె ప్రధాని మోదీని నిలదీశారు.