న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు మీడియా పట్ల తీవ్ర అసహనంతో వ్యవహరిస్తున్నదని, ఇది ఆందోళనకరమైన అంశమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(Editors Guild of India) పేర్కొన్నది. ఇటీవల యూరోప్ పర్యటనలో స్థానిక జర్నలిస్టులు ప్రధాని మోదీని ప్రశ్నించారు. కానీ ఆయన వారికి సమాధానం ఇవ్వలేదు. ఇక భారతీయ అధికారులు కూడా అక్కడ జర్నలిస్టులకు కౌంటర్ ఇచ్చే రీతిలో వ్యవహరించిన విషయం తెలిసిందే. నార్వే, నెదర్లాండ్స్ జర్నలిస్టులకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వకపోవడం పట్ల ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం ఈ ఘటన పట్ల ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
యురోపియన్ జర్నలిస్టులతో చోటుచేసుకున్న పరిణామాలు సిగ్గుచేటు ఘటన అని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. భారత్‌లో ఉన్న పత్రికా స్వేచ్ఛ, బాధ్యతపై ఆందోళన వ్యక్తం చేసింది. మీడియాను శత్రువుగా చూడడం మానుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ తన ప్రకటనలో కోరింది. 2014 నుంచి దేశ ప్రధానిగా మోదీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, కానీ ఇన్నేళ్లలో ఆయన ఒక్కసారి కూడా ఓపెన్‌గా మీడియా సమావేశంలో పాల్గొనలేదని ఎడిటర్స్ గిల్డ్ తెలిపింది. ఇది విచారించదగ్గ అంశమని ఆ సంస్థ వెల్లడించింది. ఇటీవల నార్వే పర్యటనలో ప్రధాని మోదీని జర్నలిస్టు హెల్లి లింగ్ ఓ ప్రశ్నవేశారు. దానికి ఆయన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆ అంశం వివాదాస్పదమైంది.
Statement on the Government’s Intolerance Towards Media Questions pic.twitter.com/QltQGFFY69
— Editors Guild of India (@IndEditorsGuild) May 24, 2026