PM Modi : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) సైనికాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ (Air Chief Marshal) అమర్‌ప్రీత్ సింగ్ (AP Singh) తో ప్రధాని భేటీ అయ్యారు.
ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే శనివారం భారత నౌకాదళాధిపతి, అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠీ కూడా ప్రధానితో సమావేశమయ్యారు. ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కూడా రెండుసార్లు సమావేశమైంది.
తొలి భేటీలో భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు సింధూ జలాల పంపిణీని నిలిపివేయాలని, ఉగ్రదాడికి ప్రతిగా ధీటైన జవాబు చెప్పాలని నిర్ణయించారు. రెండో భేటీలో ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించారు. దాడి చేయాల్సిన లక్ష్యాలు, దాడి సమయం త్రివిధ దళాలే నిర్ణయిస్తాయని తెలిపారు.
గత శుక్రవారం యుద్ధ సన్నద్ధతలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండిగ్, టేకాఫ్ విన్యాసాలను నిర్వహించింది. 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్థాన్‌లోకి ప్రవేశించి దాడి చేసింది. నాటితో పోల్చుకొంటే రఫెల్ యుద్ధ విమానాలు, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో ఐఏఎఫ్ శక్తి గణనీయంగా పెరిగింది.