PM Modi | న్యూఢిల్లీ, మే 2: కేరళ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ ఎంపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురం సమీపంలో నిర్మించిన విఝింజమ్ అంతర్జాతీయ ఓడరేవును శుక్రవారం ఆయన ప్రారంభించారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీ మాట్లాడూతూ ‘ఈ సభలో శశి థరూర్ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు.
కొందరికి ఇది నిద్రలేని రాత్రుళ్లను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది.’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, కేరళకు చేరుకున్న ప్రధానిని ఎంపీ స్వయంగా కలిసి స్వాగతం పలికారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్లో నాయకత్వ శూన్యత ఏర్పడిందని శశి థరూర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.