గువాహటి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన తల్లి పేరు చెప్పుకుంటూ బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఓట్ల వేట సాగిస్తున్నారు! ఆయన అస్సాంలో మాట్లాడినా, మనసు మాత్రం బీహార్లోనే ఉన్నట్లు కనిపించింది. అస్సాంలోని డరంగ్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, “మొత్తం కాంగ్రెస్ వ్యవస్థ నన్ను లక్ష్యంగా చేసుకుంటుందని నాకు తెలుసు. మోదీ మళ్లీ ఏడుస్తున్నాడు అని అంటుంది. ప్రజలే నా దేవుళ్లు. నా బాధను వారి ముందు చెప్పుకోకపోతే, ఎవరికి చెప్పుకుంటాను? వాళ్లే నా యజమానులు, నా దేవుళ్లు, నా రిమోట్ కంట్రోల్. నాకు వేరే ఇతర రిమోట్ కంట్రోల్ లేదు” అని ఆయన అన్నారు. తాను మహా శివుడి భక్తుడినని, శివుడు విషాన్ని మింగినట్లుగానే, తనపై వచ్చే దూషణల విషాన్ని తాను మింగుతానని తెలిపారు.
ఇటీవల బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ బహిరంగ సభలో కొందరు మోదీ తల్లి హీరాబెన్‌ను దూషించినట్లు వార్తలు వచ్చాయి. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినపుడు తమ నేతలెవరూ వేదికపై లేరని కాంగ్రెస్ తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఓ ఏఐ వీడియోను విడుదల చేసింది. మోదీతో హీరాబెన్ మాట్లాడుతున్నట్లు దీనిలో కనిపించింది. బీహార్ శాసన సభ ఎన్నికలు త్వరలో జరుగుతాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, వీఐపీ వంటి పార్టీలు మహా కూటమిగా ఏర్పడి పోటీ చేయబోతున్నాయి. బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేస్తాయి. ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ కూడా బరిలో దిగబోతున్నది.