న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద లక్షలాది మందికి ఆరోగ్య సేవలు అందుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఊదరగొడుతున్నది. ఈ ప్రచారంలో డొల్లతనాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బయటపెట్టింది.
నేషనల్ హెల్త్ అథారిటీకి ఐఎంఏ సమర్పించిన శ్వేత పత్రంలో.. ఈ పథకం కింద చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని, ప్యాకేజీ రేట్లు అతి తక్కువగా ఉన్నాయని, క్లెయిమ్ ప్రాసెస్ సంక్లిష్టంగా ఉందని, వీటన్నిటి వల్ల దవాఖానల ఆర్థిక పరిస్థితి ఒడుదొడుకుల్లో పడుతున్నదని వివరించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దవాఖానలకు ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము 64 లక్షల కేసుల్లో రూ.1.21 లక్షల కోట్ల మేరకు ఉన్నట్లు సమాచార హక్కు దరఖాస్తు ద్వారా తెలిసిందని తెలిపింది.