BJP | హైదరాబాద్, మే 30 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నదా? బీజేపీలో అన్నీ తామే అని ఇప్పటివరకూ చెప్పుకొంటున్న ‘మోదీ-షా’ ద్వయానికి గడ్కరీ త్వరలో చెక్ పెట్టబోతున్నారా? బీజేపీలో గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, జాతీయ-అంతర్జాతీయ పత్రికల్లో వస్తున్న విశ్లేషణలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
మోదీ-షా ద్వయానికి గడ్కరీ వర్గానికి మధ్య గడిచిన కొన్నేండ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. అయితే, నాగ్‌పూర్‌లో గడ్కరీని ఓడించడానికి మోదీ, షా, ఫడ్నవీస్ కలిసి పనిచేశారంటూ శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్ ఇటీవల వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. దీన్ని బలపరుస్తూ గడ్కరీకి అనుకూలవర్గంగా చెప్పుకొనే 1.5 లక్షల మంది నాగ్‌పూర్ ఓటర్ల పేర్లు జాబితాలో కనిపించలేదని వార్తలు వచ్చాయి.
ఎన్నికల సమయంలో గడ్కరీకి సపోర్ట్‌గా మోదీ, షా ఎలాంటి ప్రచారం చేయలేదు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో గడ్కరీ పేరును కూడా మోదీ తొలగించారు. దీంతో ఇవన్నీ విశ్లేషించుకొన్న గడ్కరీ.. తనను ఓడించడానికి ప్రయత్నించిన మోదీతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషించుకొన్న తర్వాత గడ్కరీ వర్గం తదుపరి కార్యాచరణకు దిగే అవకాశమున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీని కోసం తనకు ఎప్పుడూ అండగా ఉండే ఆరెస్సెస్ కీలక నేతలను గడ్కరీ సంప్రదిస్తున్నట్టు పేర్కొంటున్నారు.
బీజేపీలో మోదీ-షా పెత్తనంపై ఆ పార్టీ అగ్రనేతలకు ఎప్పటినుంచో అసంతృప్తి ఉన్నది. అయితే, గడ్కరీ మాత్రమే ఎప్పటికప్పుడూ మోదీ-షా వ్యవహారశైలిని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఎండగడుతూ వస్తున్నారు. మౌలిక సదుపాయాల్లో అద్భుతాలు చేయవచ్చని, కేంద్రసర్కారు సకాలంలో స్పందించకపోవడంతో ఇది కుదరట్లేదని 2022లో సొంత సర్కారుపైనే గడ్కరీ విరుచుకుపడ్డారు. వాజ్‌పేయీ, అద్వానీ, దీన్‌దయాళ్ కృషి వల్లే నేడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని, వాడుకొని వదిలేయడమే ప్రధానమయ్యిందని వాపోయారు. దీంతో 2022లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి మోదీ.. గడ్కరీకి ఉద్వాసన పలికారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయనకు ప్రాధాన్యం తగ్గించారు.
కేంద్ర జాతీయ రహదారుల మంత్రిగా ఉన్న గడ్కరీ హయాంలో హైవేలు కొంతమేర బాగుపడ్డాయని కొన్ని పత్రికలు వార్తలు రాశాయి. అయితే, ఈ క్రెడిట్‌ను గడ్కరీకి దక్కకుండా చేసిన మోదీ.. ఇది తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకొన్నారు. ఇదేసమయంలో సరిగ్గా ఎన్నికల ముందే ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేలో అవసరం లేకపోయినా ఎక్కువ నిధులు ఖర్చు చేశారంటూ కాగ్ నివేదిక ఇచ్చింది. గడ్కరీని ఇరుకున పెట్టేందుకే మోదీ ఇలా చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక, తన స్వరాష్ట్రం మహారాష్ట్రకు రావాల్సిన ఫాక్స్‌కాన్, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ వంటి పెద్ద కంపెనీలను గుజరాత్‌కు మోదీ తరలించుకుపోవడం అసహనాన్ని పెంచినట్టు చెబుతారు.
వెరసి.. మోదీ-షా ద్వయంపై గడ్కరీ వర్గం ఎన్నికల తర్వాత తిరుగుబావుటా ఎగురవేయవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే, గడ్కరీ తిరుగుబాటు చేస్తే ఆయనకు కూడా ప్రమాదమేనని చెప్తున్నారు. గడ్కరీ కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉన్న 2009నాటి ‘గడ్కరీ కుమారుడి కారులో ఏడేండ్ల బాలిక మృతదేహం’ కేసును ఇప్పుడు కేంద్రం మళ్లీ తెరమీదకు తీసుకురావచ్చని, గడ్కరీని ఇరుకున పెట్టొచ్చని అంటున్నారు. కాగా, ‘మోదీ తర్వాత పీఎంగా ఎవరు?’ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘ది ఎకానమిస్ట్’ ఇటీవల రాసిన ఓ కథనంలో పేర్కొన్న ముగ్గురు వ్యక్తుల్లో గడ్కరీ కూడా ఉండటం కొసమెరుపు.