సాహిబాబాద్, అక్టోబర్ 20: నమోఘాట్, నమో స్టేడియం (నరేంద్రమోదీ స్టేడియం).. ఇప్పుడు నమోభారత్ రైలు.. అన్నింటికీ ప్రధాని మోదీ పేర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తంచేస్తున్నాయి. దేశ మొదటి ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ(ఆర్ఆర్టీఎస్)ను ప్రధాని మోదీ శుక్రవారం యూపీలోని సహిబబాద్లో ప్రారంభించారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్లో సాహిబాబాద్-దుహాయ్ డిపో స్టేషన్ల మధ్య నడిచే నమో భారత్ రైలును ప్రారంభించారు.
ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కారిడార్ పూర్తయితే ఢిల్లీ-మీరట్ మధ్య ప్రయాణ సమయం ఒక గంట కంటే తక్కువ కానుంది.12-18 నెలల్లో ఈ కారిడార్ పూర్తి కానుందని ప్రధాని తెలిపారు. దేశపు ఈ మొదటి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీసుల్లో హైటెక్ ఫీచర్లు, ప్రయాణికులకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ రాజధాని ప్రాంత రవాణా కార్పొరేషన్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.