Vande Bharat | న్యూఢిల్లీ : దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ – విశాఖ మధ్య ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తుండగా, నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి – బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీటితో పాటు మొత్తం 10 వందే భారత్ రైళ్లను అహ్మదాబాద్ నుంచి ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు.
సికింద్రాబాద్ – విశాఖ, కలబురగి – బెంగళూరు, లక్నో – డెహ్రాడూన్, పాట్నా – లక్నో, న్యూ జల్పాయ్ గుడి – పాట్నా, పూరి – విశాఖపట్నం, రాంచీ – వారణాసి, ఖజురహో – ఢిల్లీ, అహ్మదాబాద్ – ముంబై, మైసూర్ – చెన్నై మార్గాల్లో మొత్తం 10 రైళ్లను మోదీ ప్రారంభించారు. మొత్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య 51కి చేరింది. ఇవి 45 మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి.
ఈ సందర్భంగా రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లను మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కొళ్లం – తిరుపతి మెయిల్ ఎక్స్ప్రెస్, పలు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజ్ మార్పిడి, బైపాస్ లైన్లను ప్రారంభించారు.
#WATCH | Gujarat | Prime Minister Narendra Modi flags off 10 new Vande Bharat trains and other train services, from Ahmedabad. pic.twitter.com/3Z0uaFrb4l
— ANI (@ANI) March 12, 2024