PM Modi : జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకప్పటి జమ్ముకశ్మీర్ రాష్ట్రం జమ్ముకశ్మీర్, లఢఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన చాలా రోజుల తర్వాత తొలిసారి జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఘన విజయం సాధించడంతో.. ఆ పార్టీ అగ్రనేత ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా గుర్తింపు పొందారు. గతంలో ఆయన జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
జమ్ముకశ్మీర్ ప్రాంతానికి ఇవాళ తొలి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జమ్ముకశ్మీర్ ప్రాంత అభివృద్ధి కోసం తాము ఒమర్ అబ్దుల్లా సర్కారుతో కలిసి పనిచేస్తామని చెప్పారు. కాగా ఒమర్ అబ్దుల్లా బుధవారం మధ్యాహ్నం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సక్సేనా ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించారు.
శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (SKICC) లో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, యూపీ మాజీ సీంఎ అఖిలేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. కాగా ప్రమాణస్వీకారానికి ముందు ఒమర్ అబ్దుల్లా కూడా జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని చెప్పారు.