PM Modi : బ్రిటన్ నూతన ప్రధాని (Britain new PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) కు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ఫోన్ చేశారు. బ్రిటన్ ప్రధానిగా నేడు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలియజేశారు. అంతేగాక త్వరలో భారతదేశానికి రావాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. కీర్ స్టార్మర్ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో వెల్లడించింది.
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత ప్రతిపక్ష లేబర్ పార్టీ విజయం సాధించింది. దాంతో లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో భారత సంతతికి చెందిన రిసి సునక్ ప్రధాని పదవిని కోల్పోయారు. మొత్తం 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటులో 412 స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకుంది. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలకు పరిమితమైంది. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.