న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో ఐక్య రాజ్య సమితి(యూఎన్) జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రూటే సీఎన్ఎన్తో మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై మీ వ్యూహమేమిటని భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని అడిగారని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాలు ఎదుర్కొంటున్న కారణంగానే ఉక్రెయిన్‌పై మీ వ్యూహం ఏమిటని పుతిన్‌ని మోదీ అడిగారని ఆయన అన్నారు. అయితే నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే చేసిన వ్యాఖ్యలను భారత్ శుక్రవారం తోసిపుచ్చింది. ఇది అవాస్తవం, నిరాధారం అని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అటువంటి సంభాషణేదీ జరగలేదని స్పష్టం చేసిన విదేశీ వ్యవహారాల శాఖ నాటో సెక్రటరీ జనరల్ భవిష్యత్తులో జాగ్రత్తగా మాట్లాడాలని కోరింది.