PM Modi | ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రసంగాల్లో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, ఎస్సీ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పిటిషన్‌ను ఆదేశించింది. ఫాతిమా అనే మహిళ తరఫున న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధానిపై ఆరేళ్లపాటు నిషేధం విధించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా చూసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను సైతం కోర్టు తిరస్కరించింది. ఇంతకు ముందు ఢిల్లీ హైకోర్టులో ప్రధానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. అయితే, ఢిల్లీ హైకోర్టు సైతం పిటిషన్‌ను తిరస్కరించింది. పిటిషనర్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడని.. ఆ పిటిషన్ ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్న సమయంలో కోర్టును ఆశ్రయించడం ఏమాత్రం సరికాదని పేర్కొంది. ప్రధాని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్టు ముందుగానే పిటిషనర్ ఓ నిర్ణయానికి సరికాదని హైకోర్టు తెలిపింది. ఏవిధంగా చూసినా పిటిషన్ విచారణకు అర్హత లేదని పేర్కొంటూ తోసిపుచ్చింది.