China | ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముగించుకొని చైనాకు బయలుదేరారు. ప్రధాని చైనా పర్యటనకు ముందు శనివారం భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. భారత్-చైనా కళ, విశ్వాసం, సంస్కృతులను పంచుకున్నాయని పేర్కొంది. చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ ట్వీట్ చేస్తూ.. ‘చైనాలోని టాంగ్ రాజవంశం, మొగావో గుహలలో గణేశుడి ప్రతిమను చూడవచ్చు! శతాబ్దాల కిందట చైనా, భారత్ కళ, విశ్వాసం, సంస్కృతిని ఎలా పంచుకున్నాయనేదానికి ఇది రుజువు’ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. భారతదేశం-అమెరికా మధ్య సుంకాల వివాదం కొనసాగుతున్న సమయంలో భారత్, చైనా తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన కీలకంగా పరిగణిస్తున్నారు. భారత్-చైనా దేశాలు వేల సంవత్సరాల నుంచి సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి. రెండుదేశాల మధ్య నమ్మకం, సహకారానానికి సాంస్కృతిక దౌత్యం కీలకమైందని నిపుణులు పేర్కొంటున్నారు. చైనాలోని భారత రాయబార కార్యాలయం రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను సైతం ప్రస్తావించింది. చైనాలోని భారత రాయబార కార్యాలయం ‘భారత్-చైనా మధ్య సంబంధాల గురించి కనీసం రెండో శతాబ్దం నుంచి లిఖితపూర్వకంగా రికార్డులు ఉన్నాయి.
ఇది తర్వాత బౌద్ధమతం, వాణిజ్యం ద్వారా బలపడ్డాయని తెలిపింది. ప్రధాని మోదీ రాబోయే పర్యటన సమకాలీన సమస్యలను చర్చించడానికి అవకాశాన్ని కల్పించడమే కాకుండా, రెండు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని పునరుద్ధరించడానికి సైతం అవకాశం కల్పిస్తుంది’ అని తెలిపింది. 366 ఏడీ నుంచి 10వ శతాబ్దం వరకు నిర్మించిన చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని డన్హువాంగ్లోని మోగావో, వెయ్యి బుద్ధ గుహలు భారతీయ బౌద్ధ కళను గుర్తుకు తెస్తాయి. జిన్జియాంగ్లోని బెజెక్లిక్, కిజిల్ గుహలు, లుయాంగ్లోని లాంగ్మెన్ గుహలు, దట్సులోని బావోడింగ్ గుహలు, దటోంగ్లోని యుంగాంగ్ గుహల్లోనూ భారతీయత కనిపిస్తుంది. బోధ్ గయ ఆలయ శైలిలో నిర్మించిన బీజింగ్‌లోని ఫైవ్ పగోడా ఆలయం, లుయోయాంగ్లోని వైట్ హార్స్ ఆలయం రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను సూచిస్తాయి.