న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. బీజేపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ఓ విజన్ ఉన్న నేత అని కొనియాడారు. పుట్టిన రోజు సందర్భంగా మోదీకి విషెష్ చెబుతూ త్రిపుర సీఎం మానిక్ సాహా ట్వీట్ చేశారు. విజినరీ నేత, భారతమాత ముద్దు బిడ్డకు బర్త్‌డే విషెస్ అని సీఎం మానిక్ సాహా తెలిపారు. బలమైన, సుసంపన్నమైన దేశం కోసం విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, ఇది ప్రతి ఒక్క భారతీయుడి గుండెలో మారుమోగుతుందని, క్రియాశీలమైన మీ నాయకత్వం, దీక్ష.. ఈ దేశాన్ని మారుస్తుందని త్రిపుర సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే కూడా బర్త్‌డే విషెస్ తెలిపారు. మంచి ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, భారత్‌ను 2047 వరకు డెవలప్ చేయాలని ఆశించిన ఆయన సంకల్పం నెరవేరాలని కోరుతున్నట్లు సీఎం షిండే తెలిపారు.
ప్రఖ్యాత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా మోదీకి బర్త్‌డే విషెస్ తెలిపారు. సైకత శిల్పం ద్వారా కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 74వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ 26 లక్షల అవాస్ యోజన ఇండ్లను ఆవిష్కరించనున్నారు.