PM Modi : పశ్చిమ బెంగాల్లో నమోదైన భారీ పోలింగ్.. రాష్ట్రంలో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ జంగిల్ రాజ్ పాలనకు అంతం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బెంగాల్‌లోని డుమ్ డుమ్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి టీఎంసీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో గురువారం జరిగిన తొలి దశ ఓటింగ్‌లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కూడా మోదీ మాట్లాడారు.
‘‘తొలి దశ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైందంటే అది టీఎంసీ మహా జంగిల్ రాజ్ ప్రభుత్వానికి అంతం మొదలైనట్లే. రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. బీజేపీకి అండగా నిలుస్తున్న మహిళా ఓటర్లకు ధన్యవాదాలు. గురువారం నాడు బీజేపీకి లభించిన మద్దతు పార్టీ విజయ శంఖారావం పూరించినట్లే. బెంగాల్లో ఎక్కడ ప్రజాస్వామాన్ని తన నిరంకుశత్వంతో టీఎంసీ అంతం చేసిందో, అక్కడే, మొదటి దశలోనే ప్రజలు ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని వర్తింపజేస్తాం. అర్హులైన వారికి ఐదు లక్షల వైద్యం అందిస్తాం. ప్రభుత్వం ఏర్పడ్డ తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. టీఎంసీ మహిళా వ్యతిరేక పార్టీ. మహిళలు అభివృద్ధి చెందాలని టీఎంసీ కోరుకోవడం లేదు. మహిళల భద్రతే బీజేపీ మొదటి ప్రాధాన్యం. బెంగాల్ ఆడబిడ్డలు అత్యాచారానికి గురై న్యాయం కావాలని కోరితే.. ఆడబిడ్డలు బయటకు రాకూడదని టీఎంసీ ప్రభుత్వం చెబుతోంది. మహిళలు కలలు కనడాన్ని టీఎంసీ అంగీకరించదు’’ అని వ్యాఖ్యానించారు.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన బాధిత యువతి తల్లి రత్న దేవ్నాథ్ను ప్రధాని మోదీ కలిశారు. ఆమెను బీజేపీ ఈ ఎన్నికల్లో తన పార్టీ తరఫున పానిహటి నుంచి బరిలోకి దింపింది. ఈ అంశంపై మోదీ స్పందించారు. ‘‘రత్న దేవ్నాథ్.. తన కూతురును కష్టపడి డాక్టర్ చేసింది. కానీ, టీఎంసీ ప్రభుత్వం ఆమె కూతురును తీసుకెళ్లింది. మేం ఆమె తల్లిని మా అభ్యర్థిగా నిలబెట్టాం’’ అని మోదీ అన్నారు.