PM Modi : పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ విజయం చారిత్రాత్మకమని మోదీ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడింట విజయం సాధించింది. అసోం, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి గెలిచింది. వీటితోపాటు పశ్చిమ బెంగాల్లో గెలవడం బీజేపీకి భారీ ప్రోత్సాహాన్నిచ్చింది. ఈ విజయంపై మోదీ స్పందించారు. పశ్చిమ బెంగాల్లో కమలం వికసించిందని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
2026 ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, అసోం ప్రజలు మరోసారి ఎన్డీయేను ఆశీర్వదించారని మోదీ అన్నారు. తమిళనాడులో టీవీకే అద్భుత విజయం సాధించిందని ప్రశంసించారు. తమిళనాడు ప్రజల సంక్షేమం, ప్రగతికి కేంద్రం సాయం అందిస్తుందని మోదీ తెలిపారు. బెంగాల్లో సాధించిన విజయం.. ఎన్నో ఏళ్లుగా కార్యకర్తలు సాగించిన పోరాటానికి ఫలితం అన్నారు. కార్యకర్తలు లేకుంటే విజయం సాధ్యమయ్యేది కాదని చెప్పారు. బెంగాల్ ప్రజల కోసం, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం కోసం బీజేపీ అన్నివిధాలుగా తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ప్రశంసించారు.
బెంగాల్లో ప్రజాశక్తి నిలబడిందని, బీజేపీ రాజకీయాలు మంచి పాలనకు నాంది అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని తెలిపారు. అసోంలో బీజేపీ కూటమి సాధించిన విజయం.. అక్కడి ప్రజల అభివృద్దికి, జీవితాల్లో మార్పు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనమని వివరించారు. కేరళలో విజయం సాధించిన యూడీఎఫ్ కూటమికి కూడా ప్రధాని అభినందనలు తెలిపారు. వికసిత్ కేరళ కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలో కూడా ఎన్.రంగస్వామి ఆధ్వర్యంలోని బీజేపీ కూటమి విజయం సాధించడంపై కూడా మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమ పనితీరు ఆధారంగా ప్రజలు మరోసారి అధికారాన్ని అందించారని పేర్కొన్నారు.