PM Modi : భారీ వర్షాలు (Heavy rains), వరదల (Flood) తో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రానికి తక్షణ సాయం కింద ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) రూ.1500 కోట్లు ప్రకటించారు. అదేవిధంగా ఆ రాష్ట్రంలో వరదలు, వర్షాలవల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
అంతకుముందు ప్రధాని వరద ప్రభావిత, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పరిస్థితులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే అనంతరం కాంగ్రాలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ, గవర్నర్ శివప్రతాప్ శుక్లాలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సహాయక, పునరావాస చర్యలను సమీక్షించారు. వరద బాధితులను పరామర్శించారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం వెన్నంటే ఉంటామని, వరద ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు అన్ని విధాలుగా సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, రాష్ట్ర యంత్రాంగం సేవలను ప్రధాని ప్రశంసించారు. ఇదిలావుంటే వరద నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లో పర్యటించాయి.