చెన్నై: మణిపూర్లో జరిగిన హింసకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimozhi) డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ రాజకీయాలను అనుసరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ మద్దతు, ఉదాసీనత కారణంగా జాతుల మధ్య పోరాటం, హింసాత్మక సంఘటనల్లో 220 మందికి పైగా మరణించగా, 60,000 మందికి పైగా నిరాశ్రయులైనట్లు తెలిపారు. ప్రభుత్వ సహాయ శిబిరాల్లో ఉన్నవారిని చంపడంతోపాటు మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని కనిమొళి ఆరోపించారు. హింసను అదుపు చేయడంలో విఫలమైనందుకు, బీరేన్ సింగ్ను రక్షించినందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కాగా, మణిపూర్లో హింసను ప్రేరేపించినట్లు ఆడియో టేప్ లీక్ కావడంతో సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చిందని కనిమొళి తెలిపారు. ఈ విషయం సుప్రీంకోర్టుకు కూడా చేరిందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మిత్రపక్షాలతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా బీరేన్ సింగ్ రాజీనామాలో కీలక పాత్ర పోషించాయని అన్నారు.
మరోవైపు మణిపూర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా ఆ రాష్ట్రంలో శాంతి తిరిగి నెలకొనేలా చూడాలని కనిమొళి సూచించారు. కలహాలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రంలో జరిగిన అన్ని సంఘటనలపై దర్యాప్తు కోసం ‘నిష్పాక్షిక కమిటీ’ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.