ముంబై, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ఇటీవల భారీగా పంట నష్టపోయిన రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో విలవిల్లాడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన 198 కిలోల ఉల్లిపాయలను అమ్మిన ఒక రైతుకు వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా.. అక్షరాలా 22 రూపాయలు. ఈ ఘటన అహల్యానగర్ జిల్లాలో చోటుచేసుకుంది. లాడ్జల్గావ్కు చెందిన గోరక్ష్ దారాడే అనే రైతు తాను పండించిన 198 కిలోల ఉల్లిపాయలను మార్కెట్కు తీసుకుని వచ్చి అమ్మగా రూ.298 వచ్చింది.
కూలీ, ఇతర ఖర్చులు పోగా అతనికి మిగిలింది కేవలం 22 రూపాయలు మాత్రమే. ఈ విషయాన్ని రైతు స్వయంగా వెల్లడించి, రైతును ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నదని ప్రశ్నించారు. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నానా పటోలే బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తుంది, అవన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి. 198 కిలోల ఉల్లిపాయను రైతు రూ. 298కి అమ్ముకుంటున్న సంగతి గుర్తుచేశారు.