Prashant Kishor | పీకే (ప్రశాంత్ కిషోర్).. దేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా పలు పార్టీలు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor)తో టచ్‌లోకి వెళ్లిపోతాయి. ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి వారి గెలుపులో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. సర్వేలు, సూచనలు, తనదైన వ్యూహాలతో పలు పార్టీల విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. అయితే, తాజాగా సొంతింట్లోనే ఆయన ఎన్నికల వ్యూహం పనిచేయకపోవడం గమనార్హం.
ఎన్నికల వ్యూహకర్త సేవలకు స్వస్తి పలికిన ప్రశాంత్ కిషోర్ ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party)ని స్థాపించారు. తొలిసారి బీహార్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొత్తం అన్ని స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు. అధికార, విపక్షాల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించారు పీకే. వెనుకబడిన తరగతులు, ముస్లిం, షెడ్యూల్ కులాల వారికి ప్రాధాన్యం కల్పించారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం, ఎలాంటి నేర చరిత్రలేని కొత్త ముఖాలనూ పోటీలో నిలబెట్టారు. అయితే, అక్కడ ఆయన పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు.
బీహార్‌లో పీకే ఎన్నికల వ్యూహం ఫెయిల్ అయ్యింది. జన్‌సురాజ్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. శుక్రవారం ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగానే పోస్టల్ కౌంటింగ్‌లో రెండు స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఇప్పుడు అది కూడా లేదు. ప్రస్తుతం ‘జీరో’ స్థానంలో జన్ సురాజ్ పార్టీ కొనసాగుతోంది.
బీహార్‌లో అధికారమే లక్ష్యంగా తాము బరిలో దిగుతున్నామని ప్రచార సమయంలో పీకే ఊదరగొట్టారు. ఈ ఎన్నికల్లో 243 స్థానాలకుగాను 150 స్థానాలు గెలువాలన్నది తమ టార్గెట్ అన్నారు. 150 స్థానాలకు ఒక్క స్థానం తగ్గినా తాము ఓడినట్లుగానే పరిగణిస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమ పార్టీ నుంచి గొప్పగొప్ప వ్యక్తులను బరిలో దించినట్లు చెప్పారు. అయితే, చివరికి ఒక్కస్థానాన్ని కూడా కైవం చేసుకోలేదు.
ఇక ఈ ఎన్నికల్లో పీకే ఎక్కడ పోటీ కూడా చేయలేదు. పార్టీ ప్రయోజనాల కోసమే తానీ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. మరోవైపు ఎగ్జిట్‌పోల్స్ కూడా జన్ సురాజ్ పార్టీ ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చిన విషయం తెలిసిందే. కాగా, మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 6వ తేదీన తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ నిర్వహించారు.
Also Read..
Congress | బీహార్‌లో పనిచేయని ఓట్ చోరీ అస్త్రం.. రాహుల్ ఎక్కడ..? అంటూ నెట్టింట పోస్టులు
Mahagathbandhan | ఘోర పరాభవం.. మహాగఠ్‌బంధన్‌కు గతంలోకంటే సగం స్థానాలు కూడా దక్కలేదు..!
NDA | బీహార్‌లో ఎన్డీయే జోరు.. 191 స్థానాల్లో ముందంజ