All Party Meet : వయనాద్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 167 మంది ప్రాణాలు కోల్పోయిన క్రమంలో అక్కడి పరిస్ధితిని చర్చించేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, డిప్యూటీ నేత పీకే కుంజలికుట్టి, కేరళ మంత్రులు కే. రాజన్, ఎకే శశీంద్రన్, ప్రస్తాద్, క్రిష్ణకుట్టి, రోషి అగస్టీన్, వీణా జార్జ్, రామచంద్రన్, కేలు, మహ్మద్ రియాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీ. వేణు, డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్, జిల్లా కలెక్టర్ మేఘశ్రీ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈరోజు సాయంత్రం సీఎం విజయన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటన అనంతరం సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించే క్రమంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు ఇడుక్కి, పాలక్కడ్, కోజికోడ్ జిల్లాల అసిస్టెంట్ కలెక్టర్లు అందుబాటులో ఉన్నారు.
ఇక ఘటనా స్ధలంలో సహాయ కార్యక్రమాలు వేగవంతమైన తీరును సమీక్షించేందుకు కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (కేఎస్డీఎంఎ) ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. కంట్రోల్ రూం కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. మరోవైపు ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశంలో వయనాద్ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు. సహాయ, పునరావాస కార్యక్రమాలు జరుగుతున్న వైనాన్ని సీఎం విజయన్ అఖిలపక్ష సమావేశంలో ప్రతినిధులకు వివరించారు.
Read More :