న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులు తమ ఈపీఎఫ్‌ను యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకునే అవకాశం ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ఈపీఎఫ్‌లో కొంత నిష్పత్తిలో సొమ్మును మినహాయించి, అత్యధిక సొమ్ము ను చందాదారులకు అందుబాటులో ఉంచేందుకు, ఆ సొమ్మును యూపీఐ విధానంలో తమ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడానికి వీలు కల్పించే ప్రాజెక్టును కార్మిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేస్తున్నది.
ఈపీఎఫ్‌వోతో అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడానికి అందుబాటులో ఉన్న అర్హత గల ఈపీఎఫ్ బ్యాలన్స్‌ను చందాదారులు తెలుసుకోగలుగుతారు. అనుసంధానం చేసిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) పిన్ను ఉపయోగించి, లావాదేవీని పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఈపీఎఫ్‌వో చందాదారుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము సురక్షితంగా బదిలీ అవుతుంది. ఆ సొమ్మును బ్యాంకు ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చు. ఈ విధానం సజావుగా అమలయ్యేందుకు సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో ఈపీఎఫ్‌వో ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే సుమారు 8 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుత విధానంలో సొమ్ము కావాలంటే దరఖాస్తు చేయవలసి వస్తున్నది. ఈ ప్రక్రియలో సొమ్ము సభ్యుని చేతికి చేరడానికి సమయం పడుతున్నది.