న్యూఢిల్లీ, మే 23: దేశంలో ఇంధన ధరలు పది రోజుల వ్యవధిలో మూడోసారి పెరిగాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్‌కు 87 పైసలు పెరిగింది. దీంతో అక్కడ దాని ధర రూ.98.64 నుంచి రూ. 99.51కి పెరిగింది. డీజిల్ రేటు లీటర్‌కు 91 పైసలు పెరిగి రూ.91.58 నుంచి రూ.92.49కి చేరుకుంది. సీఎన్జీ ధరను రూ.1 పెంచారు.కాగా, మే 15న లీటర్‌పై రూ.3 పెరుగగా మే 19న 90 పైసలు పెరిగింది. మొత్తమ్మీద ఇప్పటివరకు లీటర్‌పై దాదాపు రూ.5 పెరిగినట్లయింది.
చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) నష్టాలను చవిచూస్తున్న కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అనివార్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవీస్ అన్నారు. ప్రస్తుత పెరుగుదల ఓఎంసీల నష్టాలను పూర్తిగా భర్తీ చేయడానికి సరిపోకపోవచ్చని, కాబట్టి ఇంధన ధరలు మరింత పెరగొచ్చని ఆయన అంచనా వేశారు. పెరిగిన ధరల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఓఎంసీలు ప్రయత్నిస్తున్న కారణంగా సమీప భవిష్యత్తులో పెట్రో ల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.10 వరకు పెరగవచ్చని ఆర్థిక సేవల సంస్థ ఎంకే గ్లోబల్ అంచనా వేసింది. మే 15న విడుదల చేసిన ఒక నివేదికలో సుమారు 50% తక్కువ వసూళ్లను భర్తీ చేయడానికి, లీటర్‌కు రూ.10 పెంపును ఒకేసారి లేదా 2-3 వారాల పాటు దశల వారీగా అమలు చేస్తారని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. నిరుడు మార్చి 27న కేంద్రం ఇంధన దిగుమతులపై లీటర్‌కు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ ఓఎంసీలు విక్రయించే ప్రతి లీటర్ ఇంధనంపై రూ.17-18 నష్టపోతున్నాయని నివేదిక అంచనా వేసింది. దీని ఫలితంగా ఈ త్రైమాసికంలో ఓఎంసీలు రూ.57,000 -58,000 కోట్ల నష్టాలను నమోదు చేస్తాయని అంచనా వేసింది.
పది రోజుల్లో మూడుసార్లు ఇంధన ధరలను పెంచడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. ప్రజల సంపాదనను ప్రభుత్వం విడతల వారీగా లూటీ చేస్తోందని, దేశ విదేశాంగ విధానం విఫలమైందని విపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ‘పెట్రోల్-డీజిల్‌పై రోజుకు రూ.1,000 కోట్ల కేంద్ర పన్ను విధించినా బీజేపీ ఆకలి తీరలేదు. అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నపుడు ఆ ప్రయోజనాలను ప్రజలకు పంచకుండావారిని నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారు అని ఖర్గే పేర్కొన్నారు. పెట్రో ధరల పెంపుపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్ కేంద్రంపై నిప్పులు చెరిగారు.