RSS Office : ఝార్ఖండ్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై మంగళవారం అర్ధరాత్రి 12.36 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆర్ఎస్ఎస్ ఆఫీసుకు సమీపంలోకి కారుతోపాటు బైకుపై వచ్చారు. కొంతదూరంలో తమ వాహనాల్ని ఆపేసి, ఆఫీసు వద్దకు నడుచుకుంటూ వచ్చారు.
ఆఫీస్ వద్దకురాగానే రెండు పెట్రోల్ బాంబులు తీసి, వాటిని వెలిగించి విసిరేశారు. అయితే, ఒక పెట్రోల్ బాంబు గాల్లోనే పేలిపోయింది. మరోటి పేలకుండానే కిందపడిపోయింది. దీనిలోని పెట్రోల్ అంతా ఒలికిపోయింది. దీంతో ఈ ఘటనలో ఎలాంటి నష్టం సంభవించలేదు. సాధారణంగా పెట్రోల్ బాంబుల పేలుడుతో మంటలు భారీగా అంటుకుంటాయి. కానీ, ఈ బాంబులు సరిగ్గా పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడ శాంతి భద్రతల వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఝార్ఖండ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను తేలిగ్గా తీసుకోకూడదని, తీవ్రంగా పరిగణించాలని ఆయన సూచించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉండే అవకాశం ఉందన్నారు. భారీ దాడికి దీన్ని సన్నాహక పరీక్షగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత సంజయ్ సేథ్ స్పందించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు.
యెల్లో నెంబర్ ప్లేట్ కలిగిన ట్యాక్సీతోపాటు బైకులమీద వచ్చిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డట్లు ఆయన తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఆఫీసులోపల అనేక బైకులు పార్క్ చేసి ఉన్నాయని, లోపల సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. బాంబులు పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదన్నారు. రాంచీలో అల్లర్లు సృష్టించేందుకే ఈ దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.