న్యూఢిల్లీ, మార్చి 30: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. బుధవారం పెట్రోల్‌పై మరో 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.52కు పెరగ్గా, డీజిల్ వంద మార్క్ దాటేసి రూ.100.71కి చేరింది. గత తొమ్మిది రోజుల్లో ఇంధన ధరలు పెరుగడం ఇది ఎనిమిదో సారి. మొత్తంగా పెట్రోల్‌పై రూ.6.32, డీజిల్‌పై రూ.6.09 పెరిగింది.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ పెట్రో బాదుడుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం దాదాపు నాలుగు నెలల వరకు ధరలు పెంచకుండా స్తబ్ధుగా ఉండి.. ఇప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా సామాన్యుడిపై తిరిగి భారం మోపుతున్నదని మండిపడుతున్నారు.