న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 29న ముగిసిన వెంటనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సూచించింది. ప్రస్తుతం ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్కు సుమారు 120 డాలర్లు ఉంది. దీంతో దేశీయ రిటైల్ ధరలు, ప్రపంచ చమురు ధరల మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ధరలను ఇదే ప్రకారం కొనసాగించడం ప్రభుత్వానికి, రిఫైనరీలకు అసాధ్యంగా మారింది.
అయితే ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్కు 120 డాలర్ల వరకు ఉంది. దీని ఆధారంగా లీటరుకు రూ. 25-28 వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చని కొటక్ అంచనా వేసింది. కాగా, ఒకేసారి భారీ పెరుగుదల ఉండకపోవచ్చని, దశల వారీగా వారాలు లేదా మాసాలలో ఇది జరుగవచ్చని సంస్థ తెలిపింది. నష్టాలను తగ్గించుకునే క్రమంలో ద్రవ్యోల్బణాన్ని కూడా ప్రభుత్వం సమతుల్యం చేయవలసి ఉంటుందని కొటక్ పేర్కొన్నది.
అలాంటిదేమీ లేదు
ఈ వార్తా కథనంపై పెట్రోలియం మంత్రిత్వశాఖ తక్షణమే స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కొన్ని వార్తాకథనాలు వెలువడ్డాయని, అయితే అటువంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నిజానికి గడచిన నాలుగేండ్లలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచని ఏకైక దేశం భారత్ మాత్రమేనని కూడా పేర్కొన్నది. అంతర్జాతీయ ధరల ప్రభావం భారత పౌరులపై పడకుండా భారత ప్రభుత్వం, దేశంలోని, ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు నిరంతర చర్యలు చేపట్టాయని మంత్రిత్వశాఖ తెలిపింది.