NEET | న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో విద్యార్థుల సమాధాన పత్రాల్లోని ఓఎంఆర్ షీట్లను జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) అధికారులు కొందరు తారుమారు చేశారని.. దీనిపై సీబీఐ, ఈడీ తో సమగ్ర విచారణ జరిపించాలని తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదే తరహా పిటిషన్‌ను హైకోర్టులో ఉపసంహరించుకున్న తర్వాత నీట్‌కు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి జూలై 8న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు పిటిషన్‌దారుకు తెలిపింది. ఇంకోవైపు నీట్-పీజీ పరీక్ష రద్దుపై స్పందించాలని రాజస్థాన్ హైకోర్టు సోమవారం కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. పరీక్షను రద్దు చేయాలని పిటిషన్లు కోరాయి. దీనిపై జస్టిస్ అశోక్‌కుమార్ జైన్ స్పందిస్తూ జూలై 10న విచారణ చేపడతామన్నారు.
దేశవ్యాప్తంగా జరిగే పబ్లిక్ పరీక్షలు, కామన్ ఎంట్రెన్స్ టెస్టుల్లో అక్రమాలు నిరోధించే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 2024’ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ఈ చట్టం కింద పేపర్ లీక్ కారకులకు 5 నుంచి 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించే వీలుంది. కంప్యూటర్ ఆధారిత టెస్ట్‌లు సహా మిగతా పరీక్షలన్నింటికీ నిబంధనలు, ప్రమాణాలు, మార్గదర్శకాల్ని రూపొందించే బాధ్యతను ‘నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ’కి అప్పగించింది.