న్యూఢిల్లీ, డిసెంబర్ 16: సుప్రీంకోర్టుకు ఏ కేసూ చిన్నది కాదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టంచేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి స్పందించకుండా బాధితులకు ఉపశమనం కలిగించకపోతే ఇక తామున్నది ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు పార్లమెంట్లో సుప్రీంకోర్టును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే చీఫ్ జస్టిస్ ఈ విధంగా స్పందించడం గమనార్హం. దేశంలో పెండింగ్ కేసులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని, ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లు, పనికిమాలిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరపకూడదని కిరెణ్ రిజిజు గురువారం రాజ్యసభలో వ్యాఖ్యానించారు. శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ‘వ్యక్తిగత స్వేచ్ఛ’కున్న ప్రాముఖ్యతను ఎత్తిచూపింది.
ఈ దేశ పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసుల విషయంలో సుప్రీంకోర్టు స్పందించకపోతే.. రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలను అది ఉల్లంఘిస్తున్నట్టే అని పేర్కొన్నారు. ‘మా మనస్సాక్షిని మేము వినకపోతే.. ఇక మేమెందుకున్నట్టు’ అని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యుత్తు చట్టం కింద తొమ్మిది కేసులలో 18 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మాకు ఏ కేసూ చిన్నది కాదు. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలపై మేము స్పందించకుండా బాధితులకు సహాయం చేయకపోతే.. ఇక్కడ మేమేం చేస్తున్నట్టు?’ అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో తాము స్పందించకపోతే.. ఆర్టికల్ 136 (రాజ్యాంగం ప్రకారం ఉపశమనం కల్పించే ప్రత్యేక అధికారాలు)ను ఉల్లంఘిస్తున్నట్టే అని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం గుర్తించిన అత్యంత ప్రశస్తమైన, విడదీయలేని హక్కు అని వివరించారు.
నేటి నుంచి సుప్రీంకోర్టుకు సెలవు జనవరి 2న పునఃప్రారంభం
సుప్రీంకోర్టు ధర్మాసనాలకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సెలవు ప్రకటించారు. ఈ నెల 17 నుంచి జనవరి ఒకటి వరకు ధర్మాసనాలకు శీతాకాలం సెలవులని తెలిపారు. కోర్టులు సెలవులు తీసుకోవడాన్ని కూడా కేంద్ర మంత్రి రిజిజు తప్పు పట్టిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘కోర్టులకు దీర్ఘకాలం సెలవులు న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూలం కాదు అన్న భావన ప్రజల్లో ఉన్నది’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకున్నది. ‘రేపటి (శనివారం) నుంచి జనవరి 1 వరకు ధర్మాసనాలు పనిచేయవు’ అని జస్టిస్ చంద్రచూడ్ కోర్టు ఆవరణలో ఉన్న లాయర్లతో చెప్పారు.