న్యూఢిల్లీ: ప్రజలు పార్లమెంటులో పిటిషన్లు వేసేలా, వారు కోరిన అంశాలపై సభలో చర్చ జరిగేలా కొత్త వ్యవస్థను తీసుకురావాలని లేదా ఈ మేరకు నిబంధనలు అమలు చేయాలని కోరుతూ కరణ్ గార్గ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 14, 19(1), 21 ఆర్టికళ్ల ప్రకారం పార్లమెంటులో చర్చలు కోరే ప్రాథమిక హక్కు పౌరులకు ఉన్నదన్నారు. ప్రజలు ఓట్లేశాక ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి భాగస్వామ్యం ఉండటం లేదన్నారు. ప్రజా ప్రతినిధులను ప్రజలు కలిసేలా ఎలాంటి అధికారిక వ్యవస్థ లేకపోవడం వల్ల చట్టాలు చేసే ప్రక్రియతో ప్రజలు సంబంధాన్ని కోల్పోతున్నారన్నారు. పిటీషన్ కాపీని కేంద్రం న్యాయవాదికి అందించాలని కోర్టు తెలిపింది.