Blood Disorders | తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ తదితర రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు దివ్యాంగుల కేటగిరి కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులు కాదని సామాజిక న్యాయశాఖ స్పష్టం చేసింది. అయితే, 2016 దివ్యాంగుల హక్కు చట్టం కింద మూడు వ్యాధిగ్రస్తులను దివ్యాంగుల జాబితాలో చేర్చారు. దీంతో రిజర్వేషన్ తదితర ప్రయోజనాలను అందిస్తుందని భావించారు. రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో చట్టం ఉద్దేశం దెబ్బ తింటుందని పలువురు కార్యకర్తలు పేర్కొంటున్నారు. 2016 చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం.. ‘తలసేమియాతో సహా రక్త రుగ్మతలు ఉన్న వ్యక్తులు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ప్రయోజనానికి అర్హులు కాదు’ అని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమా భూమిక్ స్పష్టం చేశారు.
దృష్టి లోపం, వినికిడి లోపం, మస్తిష్క పక్షవాతం, కుష్టు వ్యాధి, మరుగుజ్జులు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనతతో సహా లోకోమోటర్ వైకల్యం, ఆటిజం, ఇంటలెక్చువల్ డిసెబిలిటీ, స్పెసిఫిక్ లర్నింగ్ డిసెబిలిటీ, మానసిక అనారోగ్యం తదితర బహుళ వైకల్యానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. తలసేమియా రక్త రుగ్మతల బాధితులకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై కారణాలను ఎంపీలు రితేశ్ పాండే, శశి థరూర్ లోక్సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి ప్రతిమా భూమిక్ సమాధానం ఇచ్చారు.
పార్లమెంట్లో దివ్యాంగులచట్టం-2016లో చట్టం ఆమోదానికి ముందు కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, యూటీలు, పౌర సంఘాలు, ఇరత వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపులు జరిగాయన్నారు. ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధ్యాపక సభ్యుడు, దివ్యాంగుల హక్కుల కార్యకర్త సతేందర్ సింగ్ మాట్లాడుతూ.. మూడు వ్యాధులను దివ్యాంగుల చట్టంలో చేర్చి.. ఆ తర్వాత రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో మొత్తం ప్రయోజనం దెబ్బతింటుందన్నారు. 2019 రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ సమయంలో కోర్టు కేంద్రం స్పందన కోరింది. ఆ తర్వాత స్పందనను పరిగణలోకి తీసుకొని పిటిషన్ను కొట్టివేసింది.