అరుణాచల్ ప్రదేశ్ కోసం తమ తమ జీవితాలను త్యాగం చేసిన వారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంగ్లో అబోర్ యుద్ధంలో అయినా, సరిహద్దుల రక్షణ అయినా… అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు చూపిన శౌర్యం, పరాక్రమం నిరుపమానమని, ప్రతి భారతీయుడికి అదో అమూల్యమైన వారసత్వ సంపద అని మోదీ కొనియాడారు. అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.
21 వ శతాబ్దంలో తూర్పు భారతం ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు దేశ అభివృద్ధికి ఓ ఇంజన్‌గా మారుతున్నాయని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు మోదీ అభిప్రాయపడ్డారు. తూర్పు ఆసియాకు అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన ద్వారంగా మారేందుకు తాము కృషి చేస్తున్నామని, అన్ని మౌలిక సదుపాయాలూ కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇక.. దేశ భద్రతలో అరుణాచల్ కీలక పాత్ర పోషించేలా సన్నాహాలు కూడా చేస్తున్నామని మోదీ తెలిపారు. దేశభక్తిని, సామరస్యాన్ని, స్థానిక సంస్కృతిని ముందుకు తీసుకెళుతున్న విధానం అమోఘమని, దేశానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని మోదీ కొనియాడారు.