భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ (Prahlad Patel) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు యాచించే అలవాటు పెంచుకున్నారని అన్నారు. ప్రజా సమస్యల వినతులను ‘భిక్షాటన’గా ఆయన అభివర్ణించారు. శనివారం రాజ్‌గఢ్ జిల్లాలో వీరాంగన రాణి అవంతిబాయి లోధి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రహ్లాద్ పటేల్ పాల్గొన్నారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రి అయిన ఆయన ఈ సందర్భంగా సభలో ప్రసంగించారు. ‘ప్రభుత్వం నుంచి భిక్షాటన చేసే అలవాటును ప్రజలు పెంచుకున్నారు. నాయకులు వచ్చినప్పుడు పిటిషన్లతో నిండిన బుట్టను అందజేస్తారు. వారికి వేదికపై దండలు వేస్తారు. వారి చేతుల్లో లేఖలు ఉంచుతారు. ఇది మంచి అలవాటు కాదు. అడగడానికి బదులుగా, ఇచ్చే మనస్తత్వాన్ని పెంపొందించుకోండి. ఇది సంతోషకరమైన జీవితానికి దారితీస్తుంది. సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నా’ అని అన్నారు.
కాగా, ప్రజలు ఉచితాలపై అధికంగా ఆధారపడటం సమాజాన్ని బలోపేతం చేయడానికి బదులుగా బలహీనపరుస్తుందని మంత్రి ప్రహ్లాద్ పటేల్ అన్నారు. ‘ఈ యాచకుల సైన్యం సమాజాన్ని బలోపేతం చేయడం లేదు. అది బలహీనపరుస్తుంది. ఉచిత వస్తువుల పట్ల ఆకర్షణ ధైర్యవంతులైన మహిళల గౌరవానికి చిహ్నం కాదు. మనం వారి విలువలకు అనుగుణంగా జీవించినప్పుడు అమరవీరుడిని నిజంగా గౌరవిస్తారు’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎప్పుడైనా భిక్షాటన చేసిన అమరవీరుడి పేరు చెప్పగలరా? అని ప్రహ్లాద్ పటేల్ అడిగారు. అలా అయితే తనకు చెప్పాలని అన్నారు. ‘నర్మద పరిక్రమ యాత్రికుడిగా నేను భిక్ష అడుగుతా. కానీ నా కోసం ఎప్పుడూ అడగను. ప్రహ్లాద్ పటేల్‌కు ఏమీ ఇచ్చారని ఎవరూ చెప్పరు’ అని అన్నారు.
కాగా, బీజేపీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంపీ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతు పట్వారీ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. ‘బీజేపీ అహంకారం ఎంత స్థాయికి చేరిందంటే వారు ప్రజలను బిచ్చగాళ్ళు అని పిలుస్తున్నారు. ఎన్నికలకు ముందు తప్పుడు వాగ్దానాలు చేసి, వాటిని నెరవేర్చడానికి నిరాకరిస్తారు. ప్రజలు వాటిని గుర్తుచేసినప్పుడు సిగ్గు లేకుండా బిచ్చగాళ్ళు అని పిలుస్తారు. వారు గుర్తించుకోవాలి. త్వరలో ఈ బీజేపీ నాయకులు ఓట్లు అడుక్కోవడం కోసం వస్తారు’ అని మండిపడ్డారు.