Karnataka | బెంగళూరు, అక్టోబర్ 29: కర్ణాటకలో విద్యుత్తు, నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం గంట కూడా వ్యవసాయానికి సరిగ్గా కరెంట్ ఇవ్వకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. పొలాలు ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ట్యాంకర్లతో పంటపొలాలను తడుపుతున్నారు. కరెంట్ కోతలకు నిరసనగా విద్యుత్తు కార్యాలయాల ముందు నిరసనలకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన అధికార కాంగ్రెస్.. ప్రజా సమస్యలను ఎత్తిచూపి వాటి పరిష్కారానికి కృషిచేయాల్సిన ప్రతిపక్ష బీజేపీ.. రెండూ అధికారం కోసం పాకులాడుతున్నాయి. రాష్ట్రంలో ఆపరేషన్ హస్త, ఆపరేషన్ లోటస్ జోరుగా సాగుతున్నది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన రెండు పార్టీలూ.. ప్రత్యర్థి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపైనే దృష్టి సారించాయి.
డీకే బహిరంగ ప్రకటనలు
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 నియోజకవర్గాలకుగానూ మెజార్టీ స్థానాల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీతోపాటు ఇతర పార్టీల నేతలకు గాలం వేసే ప్రయత్నాలు చేస్తున్నది. పార్టీని 20కి పైగా లోక్‌సభ స్థానాల్లో గెలిపించుకోవడం ద్వారా ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుర్చీకి ఎసరు పెట్టి, తర్వాతి రెండున్నర ఏండ్ల టర్మ్కుగానూ సీఎం పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరే ప్లాన్‌లో ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ప్రతిపక్ష పార్టీల్లోని నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలంటూ డీకే శివకుమార్ బహిరంగంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్‌లో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. సీఎం కుర్చీని కాపాడుకొనేందుకు అటు సిద్ధరామయ్య, దాన్ని లాక్కొనేందుకు ఇటు డీకే ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. తమ వర్గం మంత్రులు, నేతలతో చర్చలు జరుపుతూ.. ఒకరికి ఒకరు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నాలు
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఇది దాదాపు అసాధ్యమైనప్పటికీ, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, అయితే అది సాధ్యం కాదని డీకే శివకుమార్ ఇటీవల పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ప్రముఖ నాయకులు ఉన్నారని వ్యాఖ్యానించారు. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్‌కు 136 ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు 66 మంది, ఇటీవల ఆ పార్టీ పొత్తు కుదుర్చుకొన్న జేడీఎస్‌కు 19 మంది శాసనసభ్యులు ఉన్నారు. 113 మెజార్టీ మార్క్ కాగా బీజేపీ, జేడీఎస్‌లకు కలిపి 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
50 కోట్లు.. మంత్రి పదవి ఆఫర్
కాంగ్రెస్ ఎమ్మెల్యే గనిగా రవి ఇటీవల కమలం పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పలువురు తన సహచర ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారని అన్నారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండా.. ‘వారు ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడారు’ అని ఆరోపించారు. మైసూర్ రీజియన్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ, బెళగావికి చెందిన ఓ మాజీ మంత్రి, మాజీ సీఎం యెడియూరప్పకు అత్యంత సన్నిహితులు ఈ ఆఫర్లు ఇచ్చారని, ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశం తమకు లేదని, ఇప్పటికే కాంగ్రెస్‌లో అనేక గ్రూపులు ఉన్నాయని పేర్కొన్నది.
సిద్ధరామయ్య అంతర్గత భేటీ
సీఎం సిద్ధరామయ్య శుక్రవారం రాత్రి తన సహచర మంత్రులతో అంతర్గతంగా విందు సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఈ సమావేశంలో మంత్రులు జీ పరమేశ్వర, హెచ్‌సీ మహదేవప్ప, సతీశ్ జార్ఖిహోలి హాజరయ్యారు. డీకే శివకుమార్ లేకుండా ఈ భేటీ జరుగడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చినట్టు అయింది. సీఎం పీఠాన్ని దక్కించుకొనేందుకు డీకే చేస్తున్న ప్రయత్నాలను, ఆయన పెట్టుకొన్న ఆశలను అడ్డుకొనే ప్రయత్నంలో భాగంగా సీఎం సిద్ధరామయ్య పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరమేశ్వర నివాసంలో ఈ భేటీ జరుగ్గా.. సమావేశంలో సీఎం సీటు పంపకంపై చర్చ జరిగిందని, డీకేకు సీఎం పదవి కట్టబెట్టేందుకు సిద్ధరామయ్య అనుకూలంగా లేరని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అధిష్ఠానం సీఎం సీటు షేరింగ్ చేపడితే తదుపరి సీఎం అభ్యర్థిగా పరమేశ్వర పేరు ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది.