హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టులపై జరుపుతున్న ఎన్కౌంటర్లను తక్షణమే ఆపి, శాంతిచర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే మావోయిస్టులు శాంతి చర్చల కోసం లేఖలను విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
మావోయిస్టులు టెర్రరిస్టులు కాదని, వారూ మనదేశ పౌరులనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌తో చర్చలు జరిపిన కేంద్రం.. మావోయిస్టులతో చర్చలు జరిపితే తప్పేముందని ప్రశ్నించారు. ఇప్పటికైనా శాంతిచర్చలు జరపటానికి కేంద్రం చొరవచూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.