పాట్నా: బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న న్యాయస్థానం.. 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడాది నవంబర్లో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం చేసిన సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వ్ చేయగా, తాజాగా రిజర్వేషన్లను రద్దు చేస్తూ తుది తీర్పునిచ్చింది. అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తామని డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు.
కులాల వారీగా జనాభా సంఖ్యను తేల్చేందుకు నితీశ్ కుమార్ ప్రభుత్వం గత ఏడాది కులగణన చేపట్టింది. ఓబీసీలు, ఈబీసీలు కలిపి రాష్ట్రంలో 63 శాతం వరకు ఉన్నట్టు తేలింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతానికి పైగా ఉన్నట్టు వెల్లడైంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ కోటాతోనే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు పెట్టిన 50 శాతం పరిమితి ఇప్పటికే దాటిపోయిందనే అభిప్రాయంతో.. బీహార్ ప్రభుత్వం కులగణన తర్వాత అసెంబ్లీలో రిజర్వేషన్ల చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ తీసుకొచ్చిన బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు రిజర్వేషన్ల కోటాను పెంచుతూ గత ఏడాది నవంబర్ 21న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాతో కలిపి రాష్ట్రంలో రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి.