Delhi High Court | డాబర్ చ్యవన్‌ప్రాశ్‌కు వ్యతిరేకంగా పతంజలి ఆయుర్వేద్ జారీ చేసిన ప్రకటలన్నింటినీ నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ యాడ్స్‌ను ప్రసారం చేయకుండా జస్టిస్ మిని పుష్కర్ణ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమ కంపెనీ ఉత్పత్తులను పతంజలి కంపెనీ అవమానిస్తోందంటూ డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ జరిపిన జడ్జి ప్రకటనలు జారీ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ సందర్భంగా ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్నట్లుగా తాము మాత్రమే చ్యవన్‌ప్రాశ్ తయారు చేస్తున్నట్లుగా పతంజలి సంస్థ ప్రకటనల్లో పేర్కొంటుందని.. ఇతర సంస్థలు మాత్రం సరైన ఉత్పత్తులు తయారు చేసే పరిజ్ఞానం లేదని ప్రకటనలో పేర్కొంది.
అయితే, దీనిపై డాబర్ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీ యాడ్స్‌ను నిలిపివేయడంతో పాటు తమ పరువుకు భంగం కలిగించినందుకు రూ.2కోట్ల పరిహారాన్ని సైతం ఇప్పించాలని కోరింది. కేవలం తమ ఉత్పత్తులే సరైనవని పతంజలి కంపెనీ ప్రకటనల్లో క్లెయిమ్ చేరసుకుంటోందని డాబర్ ఆరోపించింది. డాబర్ కంపెనీ తరఫున న్యాయవాదులు జవహర్ లాలా, మేఘనా కుమార్ విచారణకు హాజరయ్యారు. కోర్టు కేసును జులై 14న మరోసారి విచారించనున్నది. ఇదిలా ఉండగా.. తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో ఇప్పటికే బాబా రామ్‌దేవ్ కోర్టుకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కొవిడ్, ఇతర వ్యాధులను నయం చేయడంలో పతంజలి తప్పుడు ప్రచారం చేరస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తప్పుదారి పట్టించే ప్రకటనలను ఆపేయాలని సుప్రీంకోర్టు పతంజలిని ఆదేశించింది. అయినా, కంపెనీ ప్రమోషన్స్‌ను ఆపకపోవడంతో పంజతలి కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణను వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆదేశాలు పాటించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆ తర్వాత బాబా రాందేవ్, బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కేసు విచారణను ముగించింది. ఇదిలా ఉండగా.. హమ్దార్డ్ కంపెనీ ‘షర్బత్ జిహాద్’పై బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కంపెనీ ఉత్పత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దని మే ఒకటిన ఢిల్లీ హైకోర్టు యోగా గురువును ఆదేశించింది.