Passport Relief : పొరుగు దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు భారత ప్రభుత్వం పాస్‌పోర్టుల (Passports) విషయంలో ఊరటనిచ్చింది. బంగ్లాదేశ్ (Bangladesh), ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan), పాకిస్థాన్ (Pakistan) దేశాల్లో మతపరమైన పీడనను భరించలేక భారత్‌కు వచ్చిన మైనారిటీలు (హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రిస్టియన్ మతస్తులు) మన దేశంలో పాస్పోర్టుగానీ, ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్లుగానీ లేకుండా ఉండేందుకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది.
అయితే గత ఏడాది అమల్లోకి వచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ ప్రకారం.. 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాక్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్‌ల నుంచి భారత్‌కు వచ్చిన మైనారిటీలకు మాత్రమే పాస్‌పోర్టు లేకున్నా నివాసం ఉండే అవకాశం ఉంటుంది. కానీ 2014 తర్వాత కూడా వచ్చిన చాలామంది మైనారిటీల పరిస్థితి దయనీయంగా మారుతుంది. అందుకే కొత్తగా అమల్లోకి వచ్చిన ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ – 2025’ కింద తాజా ఆదేశాలు జారీచేశారు.
తాజా ఆదేశాల ప్రకారం.. 2024 డిసెంబర్ 31 వరకు భారత్‌కు వచ్చిన అందరికీ పాస్‌పోర్టు రిలీఫ్ లభిస్తుంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2024 డిసెంబర్ 31 కంటే ముందు భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రిస్టియన్ మైనారిటీలు ఎలాంటి పాస్‌పోర్టులు, ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా ఉన్నా, కలిగి ఉన్నా, లేదంటే ఆ డాక్యుమెంట్లు కాలం చెల్లినవి అయి ఉన్నా వారు ఇక్కడ ఉండేందుకు అర్హులని ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ – 2025 చెబుతోందని హోంశాఖ తెలిపింది.