తిరువనంతపురం: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కనిపించింది. ఈ సంఘటనపై స్పందించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ బీ-737 విమానం శనివారం కేరళలోని కోజికోడ్ నుంచి దుబాయ్‌కు ప్రయాణించింది. ఆ విమానం దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అయితే ఆ విమానంలోని కార్గో భాగంలో పాము ఉన్నట్లు సిబ్బంది గమనించారు. వెంటనే ఎయిర్‌పోర్ట్‌లోని ఫైర్ సిబ్బందికి ఈ సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం ఆ విమానం అంతా క్రిమి సంహారక మందును స్ప్రే చేశారు.
మరోవైపు దేశంలోని విమానయాన నియంత్రణ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఈ విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కోజికోడ్ నుంచి దుబాయ్‌కు ప్రయాణించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కనిపించిన సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.