న్యూఢిల్లీ, జూన్ 4: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బుధవారం తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను సిఫార్సు చేసిందని విలేకరులకు రిజిజు తెలిపారు. సమావేశాలను నిర్వహించవలసిందిగా కోరుతూ రాష్ట్రపతికి ఈ సిఫార్సును పంపుతామని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్రతి సమావేశం తమకు ప్రత్యేక సమావేశమని విలేకరుల ప్రశ్నకు రిజిజు జవాబిచ్చారు. వర్షాకాల సమావేశాలలో అన్ని ముఖ్యమైన అంశాలను చర్చించవచ్చని ఆయన అన్నారు. సమావేశాలలో చర్చించాల్సిన అంశాలను ఉభయ సభలకు చెందిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీలు నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు.