మాలె, జనవరి 28: మాల్దీవుల పార్లమెంట్లో ఇద్దరు ప్రజాప్రతినిధులు బాహాబాహీకి దిగడం సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు క్యాబినెట్లోకి నలుగురు మంత్రుల చేరికకు పార్లమెంట్ ఆమోదం పొందడానికి ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారంలో భాగస్వాములైన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ), ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవులు ఎంపీలు, విపక్ష మాల్దీవన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండీపీ) ఎంపీల మధ్య ఏర్పడిన వివాదం ఈ ఘర్షణకు దారితీసింది.
విపక్షానికి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఛాంబర్లోకి ప్రవేశించకుండా కొందరు అధికార ఎంపీలు అడ్డుకున్నారు. ఎండీపీ సభ్యులు మయిజ్జు క్యాబినెట్లోకి నలుగురు సభ్యులకు ఆమో దం తెలపడానికి నిరాకరించడంతో ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్టు అధాన్ వెల్లడించింది.