Parliament security | భారత పార్లమెంట్లో మరోసారి భారీ భద్రతాలోపం (Parliament Breach) బయటపడిన విషయం తెలిసిందే. శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జీరో అవర్‌లో ఇద్దరు ఆగంతకులు లోక్‌సభ (Lok Sabha)లోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. కలర్ స్మోక్ వదిలి ఎంపీలను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ మేరకు పార్లమెంట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది.
పార్లమెంట్ భవనంలోకి ప్రవేశాలపై పలు ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేక ఎంట్రీని నిర్ణయించారు. ఎంపీలు ప్రవేశించే మార్గం గుండా ఇతరుల ప్రవేశంపై నిషేధం విధించారు. వీఐపీలు, ప్రెస్, సిబ్బంది కూడా ఇకపై వేర్వేరు గేట్ల ద్వారా లోపలికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజిటర్స్ ఎంట్రీపై కూడా కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకురానున్నారు.
నిన్నటి ఘటనతో ప్రస్తుతం పార్లమెంట్ సముదాయానికి సందర్శకులు రాకుండా ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ నిషేధం కొనసాగుతుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి సందర్శకుల అనుమతులను తక్షణం రద్దు చేశారు. పార్లమెంట్‌లోకి సందర్శకులు రావడాన్ని అనుమతిస్తే.. ఇక నుంచి వారు పాత గేటు నుంచి లోపలికి ప్రవేశించలేరు. విజిటర్స్‌కు నాలుగో గేటు నుంచి పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించేలా కొత్త నియమాలు తీసుకువచ్చారు.
ఇక గ్యాలరీ నుంచి లోక్‌సభ చాంబర్లోకి దూకకుండా ఉండేందుకు అక్కడ గాజు గ్లాసులతో కప్పేసే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా పార్లమెంట్లో విమానాశ్రయాల్లో వాడే బాడీ స్కాన్ మిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా పెంచేలా నిర్ణయించారు. భవిష్యత్‌లో మళ్లీ ఎవరూ ఇలాంటి భద్రతా ఉల్లంఘనలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read..
Lok Sabha | భద్రతా ఉల్లంఘన ఘటనపై ఆందోళన.. లోక్‌సభ నుంచి 14 మంది విపక్ష ఎంపీలు సస్సెండ్
Derek OBrien | రాజ్యసభ నుంచి తృణమూల్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ సస్పెన్షన్