న్యూఢిల్లీ : నూతన ‘ఆదాయ పన్ను-2025’ బిల్లు విషయంలో మోదీ సర్కారు తాత్కాలికంగా వెనకడుగు వేసింది. శ్రీ బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ చేసిన పలు సిఫారసులను చేర్చి కొత్త వెర్షన్ బిల్లును ఈ నెల 11న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తున్నది. ఈ బిల్లు బహుళ వెర్షన్లతో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించేందుకు అన్ని మార్పులతో కూడిన స్పష్టమైన, నవీకరించిన ఆదాయ పన్ను బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. నూతన ఆదాయ పన్ను-2025 బిల్లును మరింత మెరుగుపర్చేందుకు సెలెక్ట్ కమిటీ 285 సూచనలు చేసింది. వాటిలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు నేరుగా లబ్ధి చేకూర్చే పలు ప్రతిపాదనలు ఉన్నాయి.
ఇంటి ఆస్తుల నుంచి ఆదాయం పొందుతున్న పౌరుల కోసం సెలెక్ట్ కమిటీ రెండు ముఖ్యమైన మార్పులను సూచించింది. మున్సిపల్ పన్ను మినహాయింపుల తర్వాత ఇప్పటికే అనుమతించిన 30% ప్రామాణిక మినహాయింపును కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొనాలని, ఇది గందరగోళాన్ని తొలగిస్తుందని తెలిపింది. ప్రస్తుతం గృహ రుణ వడ్డీపై ఇస్తున్న పన్ను మినహాయింపు ప్రయోజనాలు సొంత ఇండ్లలో ఉంటున్నవారికి మాత్రమే లభిస్తున్నాయని, సొంత ఇండ్లను అద్దెకు ఇచ్చినవారికి కూడా ఈ ప్రయోజనాన్ని కల్పించాలని ప్రతిపాదించింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు టీడీఎస్ లేదా టీసీఎస్ రిఫండ్లను పొందడంలో జాప్యాలను ఎదుర్కొంటున్నందున ఆ ప్రక్రియ సులభంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని కమిటీ సూచించింది.