Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (Parliament Monsoon Session) కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమావేశాల తేదీలు కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 9 వరకు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ సమావేశాల్లోనే 2024-2025 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ (full Budget for 2024-2025)ను సమర్పించే అవకాశం ఉంది.
మోడీ 3.0 ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను జూలై 22న సమావేశాలు ప్రారంభం రోజే లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సదరు వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అయితే బడ్జెట్ సమావేశాల తేదీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కేంద్ర మంత్రి నిర్మలమ్మ సిద్ధమైనట్లు సమాచారం.
ఈనెల 24 నుంచి 18వ లోక్‌సభ తొలి సమావేశాలు..
మరోవైపు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభ సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి మొదలు కానున్నాయి. జులై 3వరకూ ఎనిమిది రోజులపాటు ఉభయసభల సమావేశాలు కొనసాగనున్నన్నాయి. ఈ సమావేశాల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది.
26న స్పీకర్ ఎన్నిక
జూన్ 24, 25 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఉండనుంది. ఆ తర్వాత 26వ తేదీన కొత్త లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటుంది. ఆ పదవికి అభ్యర్థులకు మద్దతు తెలిపే తీర్మానాల నోటీసులను 25న మధ్యాహ్నం 12 గంటల్లోగా అందించాలని లోక్‌సభ సచివాలయం గురువారం తెలిపింది.
ఆ తర్వాత జూన్ 27న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో ప్రభుత్వం చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వెల్లడించనున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంట్‌కు పరిచయం చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు.
Also Read..
Kuwait Fire | కువైట్ నుంచి బయల్దేరిన ఐఏఎఫ్ విమానం.. 11 గంటలకు కొచ్చికి
Priyanka Gandhi | వయనాడ్‌ను వదులుకోనున్న రాహుల్.. ఉపఎన్నిక బరిలో ప్రియాంక?!
Maharashtra | మహా కూటముల్లో మంటలు.. అసమ్మతి గళం వినిపిస్తున్న పార్టీలు