న్యూఢిల్లీ, మార్చి 17: పార్లమెంట్ సమావేశాలు అధికార, విపక్షాల నిరసనలతో వాయిదాలకే పరిమితమవుతున్నాయి. ఈ వారం లోక్సభ, రాజ్యసభలు 3,600 నిమిషాల పాటు సమావేశమైనా 218 నిముషాలు మాత్రమే కార్యకలాపాలు జరిగాయి. అదానీ అక్రమాలపై విచారణ జరపాలని, జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ నేత రాహుల్ ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అంటూ లండన్లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ అధికార బీజేపీ ఎంపీలు మంకుపట్టు పడుతున్నారు.
దీంతో సోమవారం నుంచి ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. శుక్రవారం కూడా ఉభయ సభల్లో అదే తంతు కొనసాగింది. వాస్తవానికి ఈ ఐదు రోజుల్లో లోక్సభ 1800 నిమిషాలు జరగాల్సి ఉండగా, కేవలం 65 నిమిషాలు మాత్రమే సభ జరిగింది. ఇక రాజ్యసభ 1800 నిమిషాలకు 152 నిమిషాలు మాత్రమే జరిగింది.