Speaker Om Birla | లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై ఇంకా పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొన్నది. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. పార్లమెంట్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు లోక్‌సబ స్పీకర్ ఓ బిర్లా ఎంపీలకు లేఖ రాశారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుపై ఆయన మాట్లాడారు. గందరోగళం కారణంగా ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలగడంపై లోక్‌సభ స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సభ సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. పార్లమెంట్ భద్రత కోసం తానే స్వయంగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశానన్నారు. మొత్తం పార్లమెంటు సముదాయానికి సంబంధించిన పలు అంశాలను కమిటీ సమీక్షిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ పటిష్టమైన చర్యలు, ప్రణాళికలు సిద్ధం చేస్తుందని భరోసా ఇచ్చారు. పార్లమెంట్‌పై ఉగ్రమూకలు దాడికి పాల్పడిన 22 సంవత్సరాల మళ్లీ అదే రోజే మళ్లీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. పార్లమెంట్‌లోకి ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఇద్దరు సభా ప్రాంగణంలోకి దూకి కలర్ స్మోక్‌ను వదిలారు.
అయితే, ఇద్దరు యువకులకు విజిటర్ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ పేరు ఉన్నది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భద్రతలో తీవ్ర లోపం తలెత్తడంతో తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ప్రతిపక్షాలు ప్రధాని మోదీ, లేదంటే హోంమంత్రి షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రచ్చ సృష్టిస్తున్నాయి. అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై పలువురు ఎంపీలను సస్పెండ్ చేశారు. విపక్షాల గొంతును నొక్కుతూ ప్రభుత్వం పారిపోతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.