న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం వాడివేడిగా ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు విపక్షాలు పట్టుపట్టడంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ వాతావరణ నెలకొంది. కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాకూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సూర్జేవాలా పహల్గాం ఉగ్ర దాడి. ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు సభా కార్యకలాపాలను సస్పెండ్ చేయాలని కోరుతూ 267 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో లోక్‌సభలో గంరదగోళం ఏర్పడింది.
ఆదివారం అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు సభలో చర్చించాల్సిన అంశాలపై పట్టుపట్టడంతో ఆపరేషన్ సిందూర్తోపాటు భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై కూడా స్పందించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం సూచనప్రాయంగా తెలియచేసింది. ఆపరేషన్ సిందూర్, ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ నుంచి సమాధానం కావాలని లోక్‌సభలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి, అందుకు దారితీసిన భద్రతా వైఫల్యం వంటి ముఖ్యమైన అంశాలు చర్చించాల్సి ఉందని లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు భారతదేశ గౌరవం, భారతీయ సైన్యం శౌర్యపరాక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. బీహార్‌లో ప్రస్తుతం సాగుతున్న ఓటరు జాబితా సవరణపై కూడా ప్రభుత్వం నుంచి సమాధానాలు కావాలని ప్రతిపక్షం డిమాండు చేసింది. ఉభయ సభలు సోమవారం తీవ్ర రభసతో సాగాయి. సభలో పెద్దపెట్టున నినాదాలు చేసిన విపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
న్యూఢిల్లీ, జూలై 21: తన అధికారిక నివాసంలో కాలిపోయిన కరెన్సీ కట్టలు కనుగొన్న తర్వాత దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు కోరుతూ 200 మందికిపైగా ఎంపీలు సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖఢ్‌కు నోటీసులు సమర్పించారు. దీంతో జస్టిస్ వర్మపై అభిశంసన ప్రక్రియ పార్లమెంట్లో ప్రారంభమైంది. రాజ్యాంగంలోని 124, 217, 218 అధికరణల కింద దాఖలు చేసిన తీర్మానానికి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, సీపీఎంతోసహా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. తీర్మానంపై సంతకాలు చేసిన వారిలో ఎంపీలు అనురాగ్ ఠాకూర్, రవి శంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూఢీ, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్, పీపీ చౌదరి తదితరులు ఉన్నారు.
రాజ్యసభలో జస్టిస్ వర్మ అభిశంసన కోరుతూ ఎంపీల నుంచి తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖఢ్ అందుకున్నారు. దీనిపై 50 మందికిపైగా ఎంపీలు సంతకాలు చేశారు. 252 మంది ఎంపీల సంతకాలతో ఇదే రకమైన నోటీసు లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించడంతో అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సెక్రటరీ జనరల్‌ని ఆదేశించారు. సుప్రీంకోర్టు లేక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీకావలసి ఉంటుంది. ఇందుకు ముందుగా 100 మంది లోక్‌సభ, 50 మంది రాజ్యసభ ఎంపీల సంతకాలతో అభిశంసన తీర్మానం సమర్పించవలసి ఉంటుంది. లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ఈ తీర్మానాన్ని ఆమోదించాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారు.