ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన కొంతమంది రైతులు ప్రధాని మోదీకి పోస్టు ద్వారా ఉల్లిపాయలు పంపి వినూత్నంగా నిరసన తెలిపారు.. ధరల పతనాన్ని నియంత్రించి గిట్టుబాటు ధర కల్పించాలని, పంట ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని షేత్కరీ సంఘటన, షేత్కరీ వికాస్ మండల్ సంఘాలకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఉల్లి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై నిషేధాన్ని తక్షణం ఎత్తివేయాలనేది తమ డిమాండ్ అని, అంతర్జాతీయ మార్కెట్ వల్ల రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందని ఓ రైతు పేర్కొన్నారు. గత ఏడాది పంటను అమ్ముకొన్న రైతులకు క్వింటాల్‌కు రూ.వెయ్యి చొప్పున పరిహారం అందించాలని రైతులు కోరారు.