చెన్నై, మార్చి 27: గత శతాబ్ద కాలంగా రామేశ్వరం వెళ్లే పర్యాటకులను ఆకట్టుకుంటున్న తమిళనాడులోని పాత పంబన్ బ్రిడ్జి స్థానాన్ని కొద్దిరోజుల్లో కొత్త వంతెన ఆక్రమించనుంది. తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి పంబన్ దీవిలోని రామేశ్వరం వరకు 2.10 కిలోమీటర్ల పొడవున సముద్రంలో ఓ రైలు మార్గం ఉంది. సముద్రంలో ప్రయాణించే నౌకలు ఈ రైలు మార్గం వద్దకు వచ్చినప్పుడు వాటికి దారినిచ్చేందుకు రైలు మార్గం దానంతటే రెండుగా విడిపోయి రైలు గేటులాగా పైకి లేస్తుంది.
దాదాపు 105 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జిని మాన్యువల్‌గా ఆపరేట్ చేస్తారు. అయితే ఇది పూర్తిగా పాతబడిపోవడంతో దాని స్థానంలో కొత్త బ్రిడ్జికి 2019 నవంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ బ్రిడ్జి నిర్మాణం 2024 సెప్టెంబర్‌లో పూర్తి కాగా వచ్చే నెలలో శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.535 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగం లిమిటెడ్ సంస్థ ఈ వంతెనను నిర్మించింది. నౌకల రాకపోకల కోసం తెరుచుకొనేటప్పుడు పాత వంతెన రెండు రెక్కలుగా విడిపోతుంది. కాగా కొత్త వంతెన అమాంతం నిలువునా 22 మీటర్ల పైకి లేస్తుంది.