న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కశ్మీర్ ఎన్నికల వేళ పొరుగు దేశమైన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్, కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ ఒకే అజెండాతో ఉన్నాయని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను మోదీ ప్రభుత్వం 2019లో రద్దు చేసింది. అనంతరం తొలిసారిగా కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పాక్ మంత్రి జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కశ్మీర్లో కాంగ్రెస్-నేషనల్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆ కూటమి ఇదే అంశాన్ని ఎన్నికల ప్రధాన అంశంగా ప్రచారం చేసిందని ఆయన తెలిపారు. పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి బీజేపీకి ఊతం లభించినట్టయ్యింది. దీనిపై హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ ఎప్పుడూ దేశ వ్యతిరేక శక్తులతో చేయి కలుపుతుందని విమర్శించారు. కశ్మీర్లో 370వ అధికరణ పునరుద్ధరణ, ఉగ్రవాదం తిరిగి వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.